విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు - జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా

Madupa Santhosh CEO
ADB: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు - జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా
ఆదిలాబాద్‌: అక్షర తెలంగాణ 

రిమ్స్‌ ప్రగతికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి.
రిమ్స్‌ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచడంతో పాటు నిర్వహణలో లోపాలను పూర్తిగా సరిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం రిమ్స్‌ ఆడిటోరియంలో అధికారులు, ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు, యూనియన్‌ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
సిబ్బందికి నెలవారీ వేతనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని, వేతనాల్లో అనధికారిక కోతలు విధిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కేటాయించిన విధులను వదిలి ఇతర పనులకు వెళ్లే సిబ్బందిని ఉపేక్షించబోమన్నారు. సానిటేషన్‌, సెక్యూరిటీ, పేషెంట్‌ కేర్‌ విభాగాల్లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు అవసరమైన మేరకు సిబ్బందిని పెంచాలని సూచించారు.
రిమ్స్‌లోకి అనధికారిక ప్రవేశాలను అరికట్టేందుకు గతంలో అమల్లో ఉన్న పాస్‌ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. గర్భిణీల వెంట ఇద్దరు, ఇతర రోగుల వెంట ఒకరు లేదా ఇద్దరు సహాయకులకు మాత్రమే అనుమతి ఉండేలా గేటు వద్దే నియంత్రణ చేపట్టాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా ఆసుపత్రిలోకి ప్రవేశించకుండా సెక్యూరిటీ సిబ్బంది కఠినంగా వ్యవహరించాలన్నారు. రిమ్స్‌ ప్రాంగణంలో గుట్కా నమలడం, ధూమపానం చేయడం, ప్లాస్టిక్‌, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయడం వంటి చర్యలకు పాల్పడితే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు, సూపర్‌వైజర్లు తమ పరిధిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
రిమ్స్‌లో సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా ఆన్‌లైన్‌ హాజరు నమోదు చేస్తున్నప్పటికీ, రిజిస్టర్‌లో ఉన్న 420 మందిలో 350 మంది మాత్రమే విధులకు హాజరవుతున్నారని కలెక్టర్‌ పేర్కొన్నారు. మిగిలిన 70 మంది హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌ హాజరు వ్యవస్థలో ఉన్న సాంకేతిక సమస్యలను నెల రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. నవంబర్‌ నుంచి ఆన్‌లైన్‌ హాజరు ఆధారంగానే వేతనాలు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ప్రభుత్వం మంజూరు చేసిన రూ.11 కోట్ల నిధులతో రిమ్స్‌లో లిఫ్ట్‌లు, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. వీల్‌చైర్లు, హెచ్‌డీఎస్‌ నిధులతో కొనుగోలు చేసిన స్ట్రెచర్లను త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆసుపత్రి వ్యర్థాలను మున్సిపల్‌ డంప్‌యార్డుకు తరలించేందుకు ప్రత్యేక ట్రాక్టర్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు ఉద్యోగుల ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ బకాయిలను డిసెంబర్‌ 3లోగా పూర్తిగా చెల్లించాలని ఆదేశించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, నర్సులు, సానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అంతకుముందు రిమ్స్‌ డైరెక్టర్‌ ఛాంబర్‌లో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది విధుల నిర్వహణ, వేతన సమస్యలు, ఇతర అంశాలపై కలెక్టర్‌ సుదీర్ఘంగా చర్చించారు.
సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, డీఎంహెచ్‌ఓ సాధన, డీపీఓ రమేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీలత, ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల ప్రతినిధులు, యూనియన్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments