ADB: పారిశుద్ధ్య నిర్లక్ష్యానికి కఠిన చర్యలు , అవసరమైతే సస్పెండ్ చేస్తాం -మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్
ఆదిలాబాద్: అక్షర తెలంగాణ
అదిలాబాద్ పట్టణంలోని 49 వార్డులకు సంబంధించిన సానిటేషన్ జవాన్లు, సానిటేషన్ డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు, సానిటేషన్ ఎస్ఐ , ఇన్‌చార్జీలతో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. అదిలాబాద్ పట్టణంలోని 49 వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ పూర్తి బాధ్యత సానిటేషన్ వర్కర్లు, డ్రైవర్లు, జవాన్లపై ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి కాలనీలో చెత్తను ఎప్పటికప్పుడు సేకరించి, ఎక్కడా చెత్త పేరుకుపోకుండా చూడాలని ఆదేశించారు. ఈ పనులపై నిరంతర పర్యవేక్షణ బాధ్యతను సానిటేషన్ ఎస్ఐ, ఇన్చార్జి నారాయణరెడ్డి పర్యవేక్షించాలని సూచించారు.పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం 49 వార్డులకు సంబంధించి 46 చిన్న చెత్త సేకరణ వాహనాలు, 21 ట్రాక్టర్లు, 3 జేసీబీలు, ఒక ల్యాడర్ తదితర వాహనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇన్ని వాహనాలు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కొన్ని వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని, అలాంటి సమయంలో పక్క వార్డుల వాహనాలను వినియోగించుకోవాలని సూచించారు. అవసరమైతే అందుబాటులో ఉన్న ఇతర వాహనాల ద్వారా సంబంధిత కాలనీలోని చెత్తను పూర్తిగా తొలగించాలని డ్రైవర్లు, జవాన్లకు స్పష్టం చేశారు.నిన్న మున్సిపల్ కార్యాలయం ఎదుట చెత్త పేరుకుపోయిన ఘటనను తీవ్రంగా పరిగణించినట్లు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, సానిటేషన్ ఎస్ఐకి షోకాజ్ నోటీసు జారీ చేయడంతో పాటు సంబంధిత జవాన్‌ను సస్పెండ్ చేయడం, ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు చిన్న వాహన డ్రైవర్లను విధుల నుంచి తొలగించడం జరిగిందని పేర్కొన్నారు.
ఇకపై ప్రతి వార్డులో సానిటేషన్ ఎస్ఐ , ఇన్చార్జీలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పారిశుద్ధ్య పనులను నిరంతరం పరిశీలించాలని ఆదేశించారు. తాను కూడా వివిధ కాలనీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై సస్పెన్షన్‌తో పాటు, విధుల నుంచి తొలగించే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అదేవిధంగా కొంతమంది డ్రైవర్లు ఒకటి లేదా రెండు ట్రిప్పులు మాత్రమే చెత్త సేకరించి 11 , 12 గంటలకే వాహనాన్ని పార్కింగ్ చేసి వెళ్తున్నారని, కాలనీలో చెత్త ఉన్నా కూడా తొందరగా డంపింగ్ యార్డుకు వెళ్లి వాహనాలను పార్కింగ్ చేసి విధులు ముగిస్తున్నారనే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇకపై అలాంటి విధానాలకు స్వస్తి పలకాలని సూచించారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తప్పనిసరిగా విధుల్లో ఉండాలని, ప్రతి కాలనీలో అవసరాన్ని బట్టి రెండు, మూడు లేదా నాలుగు ట్రిప్పులు వేసి చెత్తను పూర్తిస్థాయిలో సేకరించాలని ఆదేశించారు.ఒక కాలనీలో చెత్త సేకరణ పూర్తయ్యే వరకు సంబంధిత డ్రైవర్, సానిటేషన్ జవాన్ పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. వాహనాల్లో ఏవైనా మరమ్మతులు లేదా సాంకేతిక సమస్యలు ఉంటే ఇంజనీరింగ్ విభాగం అధికారులు వెంటనే స్పందించి వాటిని సరిచేయాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో మరికొన్ని కొత్త వాహనాలు కూడా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.
అదిలాబాద్ మున్సిపాలిటీలో ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ, పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని చైర్పర్సన్ స్పష్టం చేశారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.ఇలాంటి ఘటనలు పునరావతాలు అయితే సహించేది లేదని అవసరమైతే సస్పెండ్ చేస్తాం , విధుల నుండి కూడా తొలగిస్తామని హెచ్చరించడం జరిగింది.ప్రజలు కూడా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి సహకరించాలని ఎక్కడపడితే అక్కడ ఉదయం లేచి చెత్త వేయకూడదని , చెత్త వాహనం వచ్చేవరకు కొద్దిగా వెయిట్ చేయాలని అదేవిధంగా గౌరవ సభ్యులు కానీ , అందరూ చెత్త వాహనాలను మరియు డ్రైవర్లను కొద్దిగా పర్యవేక్షిస్తూ ఉండాలని చైర్పర్సన్ తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సానిటేషన్ ఎస్ఐ శంకర్ , నారాయణ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్, టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఎనగంటి ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఇజ్జగిరి సంజయ్, జిషాన్, అర్బాజ్, పర్వేజ్, మహిబూబ్, నాగసేన్, కిషోర్ సలీం , బబ్లు టిఆర్ఎస్ , ఎంఐఎం , కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, సానిటేషన్ ఇన్చార్జీలు , డి ఈ ఈ సందీప్, వివిధ వార్డుల సానిటేషన్ జవాన్లు, డ్రైవర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments