ప్రజావాణి ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపట్టండి.-జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

Madupa Santhosh CEO
ప్రజావాణి ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపట్టండి.-
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
 నిర్మల్‌: కలెక్టరేట్ : అక్షర తెలంగాణ
     ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదును త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. 
        సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ స్వయంగా పాల్గొని, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
       ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. సంబంధిత శాఖల మధ్య సమన్వయం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూభారతి చట్ట అమలును తహసీల్దార్లు నిరంతరం పర్యవేక్షించాలని, దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే ప్రక్రియను ఈ నెలాకరులోగా పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మార్కింగ్ ప్రక్రియ ఇప్పటికే 55 శాతం పూర్తైనట్టు తెలిపారు. మిగిలిన భాగాన్ని తక్షణమే పూర్తి చేసి, నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో రెండో దశ జ్వర సర్వే 34 శాతం పూర్తైనట్టు పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, పరీక్ష కిట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడం జరిగిందని, ఎంపీడీవోలు వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. మండలాల ప్రత్యేకాధికారులు తమ పరిధిలోని అన్ని శాఖల పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.
    రాష్ట్రంలోనే మొట్టమొదటగా నిర్మల్‌ జిల్లా సంరక్షణ గృహాల్లో ఉండే అనాధ పిల్లలకు ప్రత్యేక ఆరోగ్యశ్రీ కార్డులు అందించామని, వీటి ద్వారా వారికి రూ.10 లక్షల వరకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రశంసలు పొందిన జిల్లా మహిళా సంఘాలను కలెక్టర్ అభినందించారు.
      జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలం తాండ్రా.జి గ్రామానికి చెందిన రైతు సందుపట్ల రాజేశ్వర్‌కు, మల్బరీ ఆకుల సాగుకు షెడ్ నిర్మాణానికి సిల్క్ సమగ్ర-2 పథకం కింద రూ.4.50 లక్షల వ్యయంతో, తొలి విడతగా రూ.93,775 సబ్సిడీ చెక్కును కలెక్టర్‌ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రైతులు వినూత్నంగా ఆలోచించి కొత్త పంటల సాగు చేసి, అధిక లాభాలు సాధించాలని సూచించారు.
      ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్‌, కిషోర్ కుమార్‌, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కేజీబీవీ పాఠశాలలలోమౌలిక వసతులను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
 నిర్మల్ : కలెక్టరేట్: అక్షర తెలంగాణ : 
        జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
      సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశం కలెక్టర్ మాట్లాడుతూ, కేజీబీవీ విద్యాలయాల్లో నాణ్యమైన విద్యా బోధనతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పైకప్పుల లీకేజీలు, మరమ్మత్తులు, అదనపు మరుగుదొడ్లు, ఫ్లోరింగ్, తలుపులు, కిటికీలు తదితర అంశాలపై తహసీల్దార్లు, ఇంజినీరింగ్ అధికారులు నివేదిక అందజేయాలని సూచించారు. అవసరమైన చోట ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా పనులు చేపట్టాలని, దశలవారీగా అభివృద్ధి పనులు పూర్తిచేయాలన్నారు.
       అనంతరం వైద్యాధికారులతో సమీక్షించిన కలెక్టర్, మండలాలలోని పిహెచ్‌సీలకు అనుబంధంగా సబ్ సెంటర్ల నిర్మాణంపై ప్రణాళిక రూపొందించాలన్నారు. నిర్మాణంలో ఉన్న సబ్ సెంటర్ల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తయిన కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించాలని సూచించారు.
       ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్, డీఈఓ రామారావు, డీఎంహెచ్ఓ రాజేందర్, కేజీబీవీ సమన్వయకర్త సలోమి కరుణ, తహసీల్దార్లు, ఇంజినీరింగ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments