బాసర లో కన్నులపండుగగా వసంత పంచమి వేడుకలు

Madupa Santhosh CEO
NRML :     బాసరలో కనులపండువగా వసంత పంచమి వేడుకలు

 కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
 
     చదువుల తల్లి కొలువై ఉన్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వసంత పంచమి పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.
    అమ్మవారి దర్శనానికి ముందు, కలెక్టర్ తన కుమార్తెకు ఆలయ మండపంలో శాస్త్రోక్తంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు వేద ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
     దర్శనం అనంతరం కలెక్టర్ ఆలయ క్యూలైన్లను పరిశీలించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులతో నేరుగా మాట్లాడి, దర్శన ఏర్పాట్లపై ఆరా తీశారు. ముఖ్యంగా చిన్న పిల్లలతో వచ్చే భక్తులకు పాలు, తాగునీరు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
      ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వసంత పంచమి పర్వదినం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుని వెళ్లేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.
     ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనా దేవి, తహసిల్దార్ పవన్ చంద్ర, వివిధ శాఖల అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 NRML  :        బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్.
    వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ.

     బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని శుక్రవారం వసంత పంచమిని పురస్కరించుకొని, రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ దర్శించుకున్నారు.
   ఆలయ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీకి స్వాగతం పలికారు.  ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శాస్త్రోత్తరంగా అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. 
     అనంతరం ఆమె మాట్లాడుతూ, ఎంతో ప్రఖ్యాతి చెందిన బాసర ఆలయానికి దర్శనానికి రావడం సంతోషకరమైన విషయమని అన్నారు. ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. వసంత పంచమి పర్వదినానికి సంబంధించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించామని పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు పటిష్ట ఏర్పాటు చేస్తామని వివరించారు. 200 కోట్ల రూపాయల నిధులతో, బాసర అభివృద్ధికై మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు వివరించారు. బాసర దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
       ఈ కార్యక్రమంలో నిర్మల్, ముధోల్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పవార్ రామారావు పటేల్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో అంజనా దేవి, ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.
Comments