ఆదిలాబాద్: డిజిటల్ న్యూస్: అక్షర తెలంగాణ
ఆదివాసీ జాతరలు దేశ సమైక్యతకు ప్రతీకలు.. బాసర నుండి భద్రాచలం వరకు దేవాలయాల అభివృద్ధి: మంత్రి సీతక్క
ఆదివాసీల ఆరాధ్య దైవమైన కేస్లాపూర్ నాగోబా జాతరలో కులమతాలకు అతీతంగా భక్తులు పాల్గొనడం దేశ సమైక్యతకు, గొప్ప సంస్కృతికి నిదర్శనమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ, నాగోబా ఆలయంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు, మెస్రం వంశస్తులు, పూజారుల సూచనల మేరకు అభివృద్ధి పనులు చేపడతామన్నారు. సాగునీరు, తాగునీరు కోసం నిధులు కేటాయించేలా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారనీ తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతమైన బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న అటవీ ప్రాంతంలోని పురాతన దేవాలయాలను గుర్తించి, వాటిని అభివృద్ధి చేసే అంశంపై మంత్రివర్గంలో చర్చించడం జరిగిందని, గోదావరి పుష్కరాల నాటికి ఈ దేవాలయాలను కలుపుతూ ఒక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేసి, భక్తులకు వసతులు కల్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉందనీ అన్నారు. ఆదివాసీలు చెట్లను, పుట్టలను, నీటిని, జంతువులను పూజించడం ద్వారా ప్రకృతిని కాపాడుకుంటున్నారనీ, మెస్రం వంశస్తులు గంగాజలం తెచ్చి, ఎంతో నిష్ఠతో సంప్రదాయాలను పాటిస్తూ ఈ జాతరను నిర్వహించడం అభినందనీయమన్నారు. నాగోబా జాతర ఈ నెల 25తో ముగుస్తుండగా, 28వ తేదీన ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభమవుతుందని, ఈ మహా జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, భక్తులు, అధికారులు అందరూ తరలిరావాలని మంత్రి సీతక్క ఆహ్వానించారు.
అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు మంత్రినీ శాలువాతో సత్కరించి, నాగోబా చిత్రపటాన్ని అందించారు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటిడిఏ పీఓ యువరాజ్ మర్మాట్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మెస్రం వంశీయులు పాల్గొన్నారు.
Comments