మున్సిపల్ ఎన్నికల్లో వందశాతం ఓటింగే లక్ష్యం: జిల్లా కలెక్టర్ రాజర్షి షా.

Madupa Santhosh CEO
ADB : మున్సిపల్ ఎన్నికల్లో వందశాతం ఓటింగే లక్ష్యం: జిల్లా కలెక్టర్ రాజార్షి షా.
ఆదిలాబాద్: డిజిటల్ న్యూస్: అక్షర తెలంగాణ 
ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి ఓటరు అవగాహన ర్యాలీ ప్రారంభం

 పారదర్శకంగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు

     మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, పట్టణంలో వంద శాతం ఓటింగ్ నమోదే లక్ష్యంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా పిలుపునిచ్చారు. 
     గురువారం జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నికల అవగాహన ర్యాలీని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
       కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కలెక్టర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, ఓల్డ్ హౌసింగ్ బోర్డు మీదుగా ఎస్టీయు భవన్ వరకు సాగింది. ఈ సందర్భంగా సాంస్కృతిక కళాజాత బృందాలు ఆలపించిన చైతన్య గీతాలు, ఓటు ప్రాముఖ్యతను తెలిపే నినాదాలతో పట్టణ వీధులు మారుమోగాయి. కలెక్టర్ స్వయంగా ర్యాలీలో పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు.
       అనంతరం స్వీప్ (SVEEP) కార్యక్రమంలో భాగంగా ఎస్టీ భవన్‌లో ఏర్పాటు చేసిన ఓటరు అవగాహనా కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలన్నారు. ఓటర్లు ఎలాంటి ఆశలు, ప్రలోభాలకు లోనుకాకుండా, పారదర్శకంగా, నిర్భయంగా తమ ప్రతినిధులను ఎన్నుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కృషి చేయాలన్నారు.
        అనంతరం స్వీప్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించి, ఓటు హక్కు వినియోగంపై అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
          ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ స్రవంతి, మున్సిపల్ కమీషనర్ రాజు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, జిల్లా పౌర సంబంధాల అధికారి విష్ణువర్ధన్, మైనారిటీ సంక్షేమ అధికారి కలీమ్, మెప్మా పిడి సివిఎన్ రాజు, ఏవో వర్ణ, తహసీల్దార్లు శ్రీనివాస్, వేణుగోపాల్, గోవింద్, బూత్ స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ఉద్యోగులు, సాంస్కృతిక సారథి కళాకారులు, విద్యార్థులు, యువత, తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్:
ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలి 
పట్టణంలో వంద శాతం పోలింగ్ లక్ష్యం:
  మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతి ఓటరు బాధ్యతాయుతంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా పిలుపునిచ్చారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 38వ వార్డు, 170వ పోలింగ్ కేంద్రం పరిధిలోని తన ఓటుకు సంబంధించిన ఓటర్ స్లిప్పును బి.ఎల్.ఓలు కుంటాల భారత, జయల నుంచి ఆయన స్వయంగా స్వీకరించారు.
      ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఓటు భవిష్యత్ పాలనను నిర్ణయించేదిగా భావించాలని అన్నారు. పట్టణ పరిధిలో ఓటింగ్ శాతం పెంపు కోసం ఎన్నికల సంఘం చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతి ఓటరు పోలింగ్ రోజు తప్పనిసరిగా కేంద్రానికి వెళ్లి ఓటు నమోదు చేయాలని సూచించారు. పట్టణంలో వంద శాతం పోలింగ్ నమోదయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఓటర్లకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం సూచించిన 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చన్నారు. ఓటర్లు తమ పరిధిలోని బి.ఎల్.ఓలను సంప్రదించి ఓటర్ స్లిప్పులు తీసుకోవాలని, తమ ఓటు ఎక్కడ నమోదైందో ముందుగానే తెలుసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రం, ఓటు వివరాలపై సందేహాలుంటే వెంటనే అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పండుగగా ఎన్నికలను భావించి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పునరుద్ఘాటించారు.
     ఈ కార్యక్రమంలో ఆర్డీఓ స్రవంతి, డి పి ఆర్ ఓ  విష్ణువర్ధన్, తహశీల్దార్లు శ్రీనివాస్, వేణుగోపాల్, నాయబ్ తహశీల్దార్ ఇస్తారి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ యజ్వేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments