ఆదిలాబాద్: డిజిటల్ న్యూస్ : అక్షర తెలంగాణ :
జిల్లాలో గృహ అవసరాలతో పాటు విద్యాలయాలు, ఆసుపత్రులకు అవసరమైన ఎల్.పీ.జీ. సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని, సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌తో కలిసి గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, చమురు కంపెనీల సేల్స్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రతిరోజూ బుకింగ్, సరఫరా వివరాలపై నివేదిక సమర్పించాలని డీలర్లను ఆదేశించారు. ముఖ్యంగా ఆసుపత్రులు, వసతి గృహాలు, అనాధ శరణాలయాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా చేయాలని సూచించారు.
గృహ అవసరాలకు కేటాయించిన డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించినా లేదా అక్రమంగా నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టేందుకు పౌర సరఫరాల అధికారులు, డి.టి.లు, ఎస్.ఐ.లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే నిత్యావసర వస్తువుల చట్టం కింద కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు సకాలంలో డెలివరీ అందాలని, డెలివరీ బాయ్స్ సిలిండర్లను దారి మళ్లించకుండా డీలర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే, సిలిండర్లలో గ్యాస్ తూకం కచ్చితంగా ఉండాలని, తూనికల కొలతల శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
అంతకుముందు చమురు కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ గూగుల్ మీట్ నిర్వహించి ఎల్ .పి .జి లిండర్ల నిల్వలు, ఆన్లైన్ బుకింగ్, ఇతర అంశాలపై సమీక్షించారు.
ఈ సమావేశంలో ఏఎస్పీ సురేందర్, అటవీశాఖ అధికారులు ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, ఆర్డీఓ స్రవంతి, జిల్లా పౌర సరఫరాల అధికారి నందిని, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు, డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఎం. సంతోష్ ( ఫ్రీలాన్స్ జర్నలిస్ట్):
Comments