నిర్మల్ : డిజిటల్ న్యూస్: అక్షర తెలంగాణ:
పదో తరగతి విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలి.నిర్మల్ గ్రామీణ మండలం రత్నాపూర్ (కాండ్లి) గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించిన ఆమె, ప్రతిరోజు పారిశుధ్యాన్ని మెరుగ్గా నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా పచ్చదనం పెంపొందించాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధుల్లో కట్టుబడి పనిచేయాలని స్పష్టం చేశారు.
అనంతరం పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, ఇప్పటివరకు రాసిన పరీక్షలపై వివరాలు తెలుసుకున్నారు. మిగిలిన పరీక్షలను ఎటువంటి భయం లేకుండా ప్రశాంతంగా రాయాలని సూచించారు. సబ్జెక్టులపై ఉన్న సందేహాలను వెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని చెప్పారు. పరీక్షల కాలం ముగిసేంతవరకు ఉపాధ్యాయులు విద్యార్థులకు పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు తదితర సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ తనిఖీలో డీఈవో భోజన్న, తహసీల్దార్ ప్రభాకర్, ఎంఈవో వెంకటేశ్వర్ రావు, సర్పంచ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్: డిజిటల్ న్యూస్: అక్షర తెలంగాణ:
జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడినన్ని గ్యాస్ సిలిండర్ లు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. ప్రజలెవరూ గ్యాస్ సిలిండర్ ల సరఫరాపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రజలు తమ అవసరాలకు సిలిండర్ లు బుక్ చేసుకున్న నిర్ణీత గడువులోపు డోర్ డెలివరీ చేయబడతాయని చెప్పారు. గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్దకు వెళ్లవలసిన పనిలేదని అన్నారు. ఎక్కడ కూడా గ్యాస్ కొరత లేదని, గ్యాస్ కొరత అంటూ వస్తున్న అసత్య వార్తలను ప్రజలు ఎట్టి పరిస్థితులలో నమ్మరాదని కలెక్టర్ ఆ ప్రకటన ద్వారా కోరారు.
Comments