ఆదిలాబాదు : అక్షర తెలంగాణ
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
విద్యార్థుల సర్వాంగీణ వికాసానికి క్రీడలు ఎంతో కీలకం:
విద్యార్థుల సర్వాంగీణ వికాసానికి విద్యతో పాటు క్రీడలు ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
శనివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని TGTWURJC గురుకుల కళాశాలలో నిర్వహించిన వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో కలెక్టర్ మొక్కను నాటి నీరు పోశారు. అనంతరం హాకీ దిగ్గజం, భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయ క్రీడాకారుడైన మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఆయన సేవలను స్మరించుకున్నారు.
క్రీడలు కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని కలెక్టర్ అన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించడం, క్రమశిక్షణతో ముందుకు సాగడం, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించడం వంటి విలువలను క్రీడలు నేర్పుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకుని, అందుబాటులో ఉన్న క్రీడా వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిభ కలిగిన విద్యార్థులు నిరంతర సాధనతో తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు గురుకుల విద్యాసంస్థల్లో క్రీడలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అనంతరం కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ ప్యానెల్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. అనంతరం విద్యార్థులకు నూతన పాఠశాల యూనిఫామ్‌లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అనిల్, వైస్ ప్రిన్సిపాల్ యోగేష్ దీక్షిత్, అధ్యాపకులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాదు: అక్షర తెలంగాణ
తొలిమెట్టు (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమ అమలులో భాగంగా విద్యార్థులలో ప్రాథమిక అభ్యసన సామర్థ్యాలను మరింత పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం స్థానిక టీటీడీసీలో ఆయన అధ్యక్షతన జిల్లా స్థాయి ఎఫ్‌ఎల్‌ఎన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ముఖ్యంగా తెలుగు, గణితం, ఇంగ్లీష్ విషయాల్లో విద్యార్థులు సాధిస్తున్న ప్రగతిని, వివిధ గ్రేడ్‌ల వారీగా వారి అభ్యసన స్థాయిలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆగస్టు నెలలో ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు నిర్వహించిన పాఠశాలల తనిఖీ నివేదికలపై సుదీర్ఘంగా సమీక్ష జరిపి పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తొలిమెట్టు అమలు మార్గదర్శకాల ప్రకారం ప్రతి నెల క్రమం తప్పకుండా పాఠశాల స్థాయి (25న), మండల స్థాయి(26న), జిల్లా స్థాయి (27న) జరగాలని ఆదేశించారు. బోధనను మరింత ఆకర్షణీయంగా, సులభంగా మార్చడంలో బోధనా అభ్యసన సామాగ్రి కీలకమని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సృజనాత్మకతకు పదునుపెట్టేలా సెప్టెంబర్ 15 నుండి 19 వరకు మండల స్థాయిలో ‘టీఎల్‌ఎం మేళాలు’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మండల స్థాయిలో ఎంపికైన ఉత్తమ ప్రదర్శనలతో సెప్టెంబర్ 22న జిల్లా స్థాయి మెగా ‘టీఎల్‌ఎం మేళా’ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఉపాధ్యాయులందరూ నాణ్యమైన టీఎల్‌ఎంను సిద్ధం చేసి జిల్లా స్థాయి మేళాలో విజయవంతంగా ప్రదర్శించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో భాగంగా ఆగస్టు నెలలో ఉత్తమ బోధన సామర్థ్యాల ప్రదర్శనకు గాను బోథ్ మండలం కంటేగాం ఎంపీపిఎస్ ప్రధానోపాధ్యాయుడు గోవింద్ కు ప్రశంస పత్రాన్ని కలెక్టర్ అందజేసి, FLN క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, అకడమిక్ కోఆర్డినేటర్ లక్ష్మణ్, మండలాల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, కాంపిటెంట్ పాఠశాలల హెడ్‌మాస్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments