అంతరాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Madupa Santhosh CEO
ADB : అంతరాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్ :
ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్
ఆదిలాబాద్ : అక్షర తెలంగాణ

సైబర్ నేరాలకు పాల్పడుతున్న బిహారి సైబర్ ముఠా.

నేషనల్ ఫెర్టిలైజర్స్ పేరుతో ఫ్రాంచైజీ ఇప్పిస్తామని నమ్మించి లక్షల్లో మోసం

నిందితులపై దేశవ్యాప్తంగా 498 సైబర్ నేరాల ఫిర్యాదులు

ఇప్పటివరకు 3.5 కోట్ల వరకు మోసం చేసిన నిందితులు.

పది సెల్ ఫోన్లు, రూ 70000/- నగదు స్వాధీనం.

నిందితుల బ్యాంకు ఖాతాల్లో, స్టాక్ మార్కెట్ షేర్లలో ఉన్న 8 లక్షలు జప్తు.

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు చేస్తూ బీహార్ రాష్ట్రంలో తలదాచుకుంటూ అతి సామాన్యులుగా జీవిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్లల్లో మోసాలు చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఈ నిందితులపై దేశవ్యాప్తంగా 500 నేరాలు పాల్పడినట్లు దాదాపు 3.5 కోట్ల వరకు ప్రజల వద్ద మోసం చేసి డబ్బులను కాజేసినట్లు తెలిపారు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 90 సైబర్ క్రైమ్ నేరాలలో ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. 
ఒక నకిలీ ఫర్టిలైజర్ ఫ్రాంచైజీ ఇచ్చే వెబ్సైట్ను ఓపెన్ చేసి దేశవ్యాప్తంగా  నకిలీ వెబ్సైట్ నందు అప్లికేషన్ ద్వారా బాధితుల వివరాలను, వారి ఆధార్ పాన్, కార్డులు,బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి విడతలవారీగా బాధితుల వద్ద వివిధ రకాల ఫీజులు సర్వీస్ ఫీజు, లైసెన్సు ఫీజు, ట్రేడ్ ట్రాన్స్ఫర్ ఫీజు అంటూ లక్షల్లో వసూలు చేసి మోసం చేస్తున్నట్టు తెలిపారు.
అదేవిధంగా బజాజ్ లోన్ అంటూ నిందితులు, లోన్ కోసం ఆన్లైన్ నందు వెతికే బాధితుల వద్ద నుండి అప్లికేషన్ ద్వారా వారి వివరాలను సేకరించి ఆధార్ కార్డు, పాన్ కార్డు ద్వారా వివిధ రకాల ఫీజులు వసూలు చేస్తూ లక్షల్లో వసూలు చేస్తూ, వందల మంది బాధితులకు మోసం చేయడం జరిగిందని తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  వ్యక్తిని “National Fertilizers Pvt. Ltd.” పేరుతో నకిలీ ప్రకటన ద్వారా ఫ్రాంచైజీ ఇప్పిస్తామని నమ్మించి రూ.3,85,725/- మోసం చేయడం జరిగింది. ఈ కేసు నందు నిందితులను గుర్తించి, ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, IPS తెలిపారు.
ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. భోరాజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన అకునూరు గణేష్‌కు ఫ్రాంచైజీ రిజిస్ట్రేషన్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్, వాట్సాప్, ఈమెయిల్ ద్వారా సంప్రదించారు. ఆధార్, పాన్ కార్డు, ఫొటో తదితర వ్యక్తిగత వివరాలను సేకరించి, మొదట రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో రూ.50,000/- చెల్లించుకున్నారు.
అనంతరం లైసెన్స్, ఫ్రాంచైజీ రిజిస్ట్రేషన్, అదనపు ఛార్జీలు తదితర కారణాలు చూపుతూ పలుమార్లు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేసి, బాధితుడి నుంచి మొత్తం రూ.3,85,725/- వివిధ బ్యాంకు ఖాతాలు, UPI, NEFT మార్గాల ద్వారా బదిలీ చేయించుకున్నారు. అనంతరం నిందితులు ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలకు స్పందించకుండా మోసం చేయడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బీహార్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
1. అబిషేక్ కుమార్ @ సౌరవ్ తండ్రి విజయ్ ప్రసాద్, కుర్మీ,  బహారీ-బిఘా గ్రామం, లాల్ బిఘా పోస్ట్, కాశీచక్, నవాదా జిల్లా, బీహార్ రాష్ట్రం.
2. ఆశుతోష్ కుమార్ @ బబ్లూ తండ్రి సురేష్ ప్రసాద్, కుర్మీ,  బహారీ-బిఘా గ్రామం, లాల్ బిఘా పోస్ట్, కాశీచక్, నవాదా జిల్లా, బీహార్ రాష్ట్రం.
3. నిషు కుమార్ తండ్రి నిరంజన్ ప్రసాద్, కుర్మీ,  హుసేనా గ్రామం, నలందా జిల్లా, బీహార్ రాష్ట్రం.
4. రితేష్ కుమార్ తండ్రి అభిమన్యు ప్రసాద్, కుర్మీ,  బహారీ-బిఘా గ్రామం, లాల్ బిఘా పోస్ట్, కాశీచక్, నవాదా జిల్లా, బీహార్ రాష్ట్రం.
5. అభినాష్ కుమార్ తండ్రి రాజేంద్ర ప్రసాద్,  బహారీ-బిఘా గ్రామం, లాల్ బిఘా పోస్ట్, కాశీచక్, నవాదా జిల్లా, బీహార్ రాష్ట్రం.
నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు.
నిందితుల వద్ద నుండి పది మొబైల్ ఫోన్లను మరియు 70000 నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని, నిందితులు బాధితుల వద్ద నుండి మోసం చేసి వసూలు చేసిన డబ్బులలో 8 లక్షల రూపాయలను బ్యాంకు ఖాతాలలో, స్టాక్ మార్కెట్ షేర్లలో ఇన్వెస్ట్ చేసినట్లు వాటిని జప్తు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్, IPS మాట్లాడుతూ, ఆన్‌లైన్‌లో కనిపించే ఫ్రాంచైజీలు, ఉద్యోగాలు, పెట్టుబడులు, లైసెన్సులు తదితర ప్రకటనలను పూర్తిగా ధృవీకరించకుండా ఎలాంటి నగదు చెల్లింపులు చేయవద్దని ప్రజలకు సూచించారు. సైబర్ నేరగాళ్లు పంపించే లింకులు, నకిలీ వెబ్‌సైట్లు, బ్యాంకు ఖాతాలు, UPI వివరాలను నమ్మి డబ్బులు బదిలీ చేయవద్దన్నారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని, సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్పీ సూచించారు.
అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను గుర్తించి అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ జి శ్రావణ్, ఎస్సైలు పీర్ సింగ్, గౌతం, గోపికృష్ణ, సిబ్బంది త్రిశూల్, రాజేష్, పురుషోత్తం, రవీందర్, సత్యనారాయణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments