ఆదిలాబాద్ : అక్షర తెలంగాణ
ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో మోసాలు
దేశవ్యాప్తంగా 140 మంది బాధితుల వద్ద రూ.5.30 కోట్లకు పైగా మోసం
ఇచ్చోడకు చెందిన వ్యాపారి వద్ద రూ.2.18 లక్షల సైబర్ మోసం
నిందితుడి వద్ద రెండు మొబైల్ ఫోన్లు, రూ.1 లక్ష నగదు స్వాధీనం
సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కు సంప్రదించాలి
ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ విక్రయాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలలో సుమారు 140 మంది బాధితులను మోసం చేసి రూ.5.30 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో బాధితుడు సమీర్ సయ్యద్ తండ్రి హఫీజ్ సయ్యద్, వృత్తి: వ్యాపారం, నివాసం: వడ్డూర్ గ్రామం, నేరడిగొండ మండలం, ప్రస్తుతం బర్కత్‌పుర కాలనీ, ఇచ్చోడ మండలం. బాధితుడు గత రెండు నెలలుగా శివాజీ చౌక్‌లోని సురక్ష హాస్పిటల్ సమీపంలో A to Z పేరుతో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు.
గత జూలై 25న మొబైల్ ఛార్జర్లు, డిస్‌ప్లేలు, ఇతర యాక్సెసరీస్ అవసరం కావడంతో బాధితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ కోసం వెతికాడు. ఈ క్రమంలో syedsameer4780 అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ద్వారా Raj Led Mumbai పేరుతో ఉన్న మరో ఐడీని గుర్తించాడు. అందులో ఉన్న నంబర్‌కు ఫోన్ చేయగా, మొబైల్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ అందుబాటులో ఉన్నాయని, ముందుగా ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తే కొరియర్ ద్వారా సరుకులు పంపిస్తామని నిందితులు నమ్మించారు.
వారి మాటలను నమ్మిన బాధితుడు జూలై 25 నుంచి ఆగస్టు 8 వరకు పలు విడతల్లో వారు సూచించిన QR కోడ్ కు మొత్తం రూ.2,18,000 ఆన్‌లైన్‌లో చెల్లించాడు. అనంతరం నిందితులు వాట్సాప్ ద్వారా కొరియర్ రసీదును పంపించి, Majisa Air Express ద్వారా సరుకులు అందుతాయని తెలిపారు. రవాణా సమస్యల కారణంగా ఆలస్యం అవుతుందని చెబుతూ బాధితుడిని మరింత నమ్మించారు.
ఆగస్టు 22న సమీపంలోని Majisa Air Express కార్యాలయానికి వెళ్లి సరుకులు తీసుకోవాలని నిందితులు చెప్పడంతో బాధితుడు ఇచ్చోడ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఆ కార్యాలయం కోసం వెతికాడు. అయితే అలాంటి కార్యాలయం కనిపించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయడం జరిగింది .
బాధితుడి ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. దర్యాప్తులో నిందితుడు దేశవ్యాప్తంగా ఇదే తరహాలో 19 రాష్ట్రాల్లో 140 మందిని మోసం చేసినట్లు, సుమారు 140 మంది బాధితుల వద్ద రూ.5,30,33,494 /- కోట్లకు పైగా మోసం చేసినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రకాశ్ కుమార్ తండ్రి హరిరామ్ జీ, వృత్తి: మొబైల్ షాప్ వ్యాపారం, నివాసం: కిలావా, దబల్, సాంచోర్, జాలోర్ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం.
స్వాధీనం చేసుకున్న ఆస్తి:
ఒక లక్ష నగదు,రెండు మొబైల్ ఫోన్లు,
ఈరోజు స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సోషల్ మీడియా వేదికల్లో తక్కువ ధరలకు మొబైల్ స్పేర్ పార్ట్స్, ఇతర వస్తువులు అందిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మి ముందుగా డబ్బులు చెల్లించవద్దని సూచించారు. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసే సమయంలో విక్రేత వివరాలను పూర్తిగా పరిశీలించి, అనుమానాస్పద లింకులు, QR కోడ్లు లేదా వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు పంపకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.
ఎవరైనా సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితులు ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే, మోసపోయిన మొత్తాన్ని నిలుపుదల చేసి తిరిగి పొందే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, ఇచ్చోడ ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ కే. నరేష్ కుమార్, సైబర్ క్రైమ్ ఎస్ఐ గోపీకృష్ణ, సిబ్బంది మాజిద్, త్రిశూల్, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ : అక్షర తెలంగాణ
అత్యాశకు పోతే సైబర్ మోసాలకు గురయ్యే ప్రమాదం
సైబర్ నేరాలపై అవగాహనతో కూడిన పోస్టర్ ఆవిష్కరణ.
సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగించాలి
సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 ను సంప్రదించాలి.
ప్రతినెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగృతి దివస్‌లో భాగంగా అవగాహన కార్యక్రమం
ప్రతినెల మొదటి బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీసు కార్యాలయాల పరిధిలో నిర్వహించే సైబర్ జాగృతి దివస్ సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాను అప్రమత్తంగా వినియోగించాలని, గుర్తుతెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్టులు, మెసేజ్‌లు, లింకులు, ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
సైబర్ నేరాల్లో అత్యాశకు గురైతే మోసపోయే అవకాశం ఉందని గుర్తించాలి అని సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని, అధిక లాభాలు వస్తాయని చెప్పే ఆఫర్లను నమ్మవద్దని తెలిపారు.
సైబర్ నేరగాళ్లు వివిధ ప్రాంతాల్లో, కొన్ని సందర్భాల్లో విదేశాల్లో ఉండి కూడా నేరాలకు పాల్పడుతున్నారని, వారి పట్ల అప్రమత్తత మరియు అవగాహనతోనే సైబర్ మోసాలను అడ్డుకోవచ్చని ఎస్పీ పేర్కొన్నారు
వంటి సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎవరైనా సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ నైలు, ఆదిలాబాద్ వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్, ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అతిక్ బేగం, D4C ఏఎస్ఐ సురేందర్, పోలీసు సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ : అక్షర తెలంగాణ
బస్టాండ్‌లో పిక్‌పాకెట్ దొంగను పట్టుకున్న కానిస్టేబుల్‌కు జిల్లా ఎస్పీ అభినందన
నేర నియంత్రణలో ప్రతిభ కనబరిచే సిబ్బందికి ప్రతిరోజూ అవార్డులు అందజేస్తాం
ఆదిలాబాద్ పట్టణంలోని బస్టాండ్ వద్ద పిక్‌పాకెట్‌కు పాల్పడుతున్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ ఎస్. నగేష్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
మంగళవారం బస్టాండ్ వద్ద పిక్‌పాకెట్ చేస్తుండగా మహారాష్ట్ర, వని గ్రామానికి చెందిన సుమిత్ మాంకర్‌ను కానిస్టేబుల్ ఎస్. నగేష్ పట్టుకొని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి నేర నియంత్రణలో కృషి చేసిన కానిస్టేబుల్ ఎస్. నగేష్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రంతో పాటు నగదు రివార్డును అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేర నియంత్రణలో ప్రతిభ కనబరిచి, విధి నిర్వహణలో ప్రత్యేక కృషి చేసే పోలీసు సిబ్బందిని ప్రతిరోజూ గుర్తించి అవార్డులు అందజేస్తామని తెలిపారు. ప్రతి పోలీసు సిబ్బంది ఇదే స్ఫూర్తితో విధులు నిర్వహిస్తూ జిల్లా పోలీసుల కీర్తి ప్రతిష్టలను మరింత పెంచాలని సూచించారు. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకు ప్రతి పోలీసు సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ తెలిపారు. ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ : అక్షర తెలంగాణ
పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు నమోదు
ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
ఉట్నూర్ మండలం గంగన్నపేటకు చెందిన సూర్యవంశీ గణేష్ (27)ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసి, విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో నిందితుడిపై కేసు నమోదు చేశారు.
మే 11న అర్ధరాత్రి సమయంలో ఉట్నూర్ పోలీసులు బ్లూకోల్ట్ నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కొత్తగూడెం చెక్‌పోస్ట్ వైపు నుంచి అధిక శబ్దంతో డీజే శబ్దం వినిపించింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని డీజే శబ్దాన్ని నిలిపివేయాలని సూచించారు.
ఈ క్రమంలో అక్కడ డెకరేషన్ పని చేస్తున్న సూర్యవంశీ గణేష్ మద్యం మత్తులో పోలీస్ కానిస్టేబుల్ మడావి ప్రసాద్ కాలర్ పట్టుకుని దాడి చేసి, విధులు నిర్వహించకుండా అడ్డుకున్నాడు. అంతేకాకుండా పోలీస్ సిబ్బందితో దురుసుగా, అసభ్యకరంగా ప్రవర్తించాడు.
ఈ ఘటనపై కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం.159/2026 కింద IPC సెక్షన్ 132, 292 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గౌరవ న్యాయస్థానం అనుమతితో ఈరోజు నిందితుని పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు.
ఉట్నూర్ ఎస్‌హెచ్‌ఓ గుంపుల విజయ్ మాట్లాడుతూ.. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి చేయడం, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments