ఆదిలాబాదు: అక్షర తెలంగాణ
ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి చేర్చేందుకు అధ్యాపకులు సమష్టిగా బాధ్యతాయుతంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ విద్యా శాఖ ఆధ్వర్యంలో డి.ఏ.ఎం.సి, డి.ఆర్.పిలు, క్లస్టర్ కన్వీనర్లు, సభ్యులు, ప్రభుత్వ జూనియర్ కలశాల ప్రిన్సిపాల్స్‌తో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు మరింత మెరుగైన బోధన అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, ప్రీ-టెస్ట్, పోస్ట్-టెస్ట్ శిక్షణలను రెండు విడతలుగా విజయవంతంగా నిర్వహించిందని వెల్లడించారు. విశేషంగా డిగ్రీ కళాశాలల ప్రొఫెసర్లను రిసోర్స్ పర్సన్లుగా పిలిపించి లెక్చరర్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించడం జరిగిందని, దీనివల్ల బోధనా పద్ధతుల్లో సత్ఫలితాలు వస్తున్నాయని వివరించారు. అయితే, సమీక్షలో భాగంగా ఐ.ఎఫ్.పి ప్యానెల్ వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు సైతం ఎంసెట్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు రెసిడెన్షియల్ స్థాయిలో ప్రత్యేక కోచింగ్ అందేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సిలబస్ సకాలంలో పూర్తి కావడంతో పాటు, నెమ్మదిగా అభ్యసించే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రతి కళాశాలలోనూ విద్యార్థుల హాజరు శాతాన్ని నూటికి నూరు శాతం సాధించే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం ఇంటర్మీడియట్ అధ్యాపకులకు ఓరియెంటేషన్ శిక్షణ అందించిన జిల్లా రిసోర్స్ పర్సన్ లకు ప్రశంస పత్రాలను అందజేశారు
ఈ సమీక్షలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గణేష్ జాదవ్, డి.ఏ.ఎం.సి, డి.ఆర్.పిలు, క్లస్టర్ కన్వీనర్ సభ్యులు, ప్రభుత్వ జూనియర్ కలశాల ప్రిన్సిపాల్లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అదిలాబాదు: అక్షర తెలంగాణ
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కోచింగ్ కేంద్రాలకు దీటుగా నాణ్యమైన శిక్షణ, మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్ల ఆధునీకరణపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ స్టడీ సర్కిళ్లలో చదువుకునే విద్యార్థులకు ఆధునిక సాంకేతిక సదుపాయాలను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోర్డులు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఇన్వర్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే విద్యార్థుల సౌకర్యార్థం స్వచ్ఛమైన తాగునీటి ప్లాంట్, సుదీర్ఘ సమయం చదువుకోవడానికి అనుకూలంగా ఉండే రీడింగ్ కుర్చీలను వెంటనే సమకూర్చి పనులను వేగవంతం చేయాలన్నారు. పోలీసు ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న 200 మంది అభ్యర్థులకు ప్రయోజనం చేకూరేలా రెండు నెలల పాటు ఉచిత ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన నివేదికను వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించారు. స్టడీ సర్కిల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, నిరుద్యోగులకు సరైన దిశానిర్దేశం చేసేలా అధికారులు శ్రమించాలని కోరారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా బీసీ, ఎస్సీ సంక్షేమాభివృద్ధి అధికారిణి సునీత కుమారిని, ఇతర అధికారులు, స్టడీ సర్కిల్ డైరెక్టర్లు ప్రవీణ్, రమేష్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments