ఆదిలాబాద్: అక్షర తెలంగాణ
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ట్రిపుల్‌ఐటీలో జిల్లా విద్యార్థులు అధిక సీట్లు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
బాల్యం నుంచే విద్యార్థులు మంచి అలవాట్లు, క్రమశిక్షణ, సత్ప్రవర్తనను అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, నైతిక విలువలు, విద్యతోనే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడతాయని అన్నారు.
తలమడుగు మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ‘ఆరోగ్య పాఠశాల–ఆరోగ్య జాతర’, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ పోషణ్ మాసం కార్యక్రమాలను కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ముందుగా పోషణ్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ ఫుడ్ స్టాళ్లను కలెక్టర్ పరిశీలించారు. పౌష్టికాహారం, సమతుల ఆహారం ప్రాధాన్యాన్ని తెలుసుకున్నారు. అనంతరం పీఎం శ్రీ పాఠశాలలోని సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటో దిగారు. పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ గదిని ప్రారంభించి, విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులలో ఆరోగ్యకరమైన అలవాట్లు, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడమే ఆరోగ్య పాఠశాల, ఆరోగ్య జాతర కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షిస్తూ మార్గనిర్దేశం చేయాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని, విద్యార్థులు గంజాయి వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని హితవు పలికారు. గంజాయి సాగు, విక్రయం లేదా వినియోగానికి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
జిల్లా విద్యార్థులు బాసర ట్రిపుల్‌ఐటీలో అధిక సంఖ్యలో సీట్లు సాధించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి సరైన మార్గదర్శకత్వం అందించాలని అన్నారు. కంప్యూటర్ విద్య, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పోటీ ప్రపంచంలో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.
పోషణ్ మాసం సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని కలెక్టర్ అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్యాబోధనతో పాటు గర్భిణులు, బాలింతలకు అవసరమైన సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రజలు అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల పోస్టులను త్వరలోనే భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణ, పోషకాహారం, పరిశుభ్రత, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రదర్శించిన నాటికలు, పాటలు, ఉపన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పోషణ్ మాసం ద్వారా లబ్ధి పొందిన మహిళలు తమ అనుభవాలను, అభిప్రాయాలను వేదికపై పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, తహసీల్దార్ రాజ్‌మోహన్, ఎంఈవో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్‌రావు, సర్పంచ్ రాజన్న, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ సాయికిరణ్, లీగల్ ఎయిడ్ కౌన్సిలర్లు, సీడీపీవోలు సురేఖ, సౌందర్య, అంగన్‌వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాదు: అక్షర తెలంగాణ
లక్ష్యాన్ని నిర్దేశించుకుని శ్రమిస్తే విజయం తథ్యం: కలెక్టర్ రాజర్షిషా
నిశ్చత లక్ష్యంతో శ్రమిస్తే విజయం సాధించడం తథమని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శనివారం స్థానిక బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో 200 మంది అభ్యర్థులకు ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల కోచింగ్ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి వెలిగించి, సరస్వతి చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్టడీ సర్కిల్లో శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన కానిస్టేబుల్ లను కలెక్టర్ సన్మానించి అభినందించారు. వారు ఈ సందర్భంగా వారి కొంచింగ్ అనుభవాలను పంచుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, కేవలం 20 నుంచి 25 రోజుల్లోనే అధికారుల బృందం సమన్వయంతో మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ శిక్షణ కోసం మొత్తం 465 మంది దరఖాస్తు చేసుకోగా, ప్రతిభ ఆధారంగా 200 మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు మనసులోని భయాన్ని పూర్తిగా విడనాడి, లక్ష్య సాధనపైనే పూర్తిగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. అర్హత, ప్రతిభ ఉన్నందుకే ఈ శిక్షణకు ఎంపికయ్యారని, స్టడీ సర్కిల్లో అవసరమైన డిజిటల్ బోర్డులు, నాణ్యమైన స్టడీ మెటీరియల్, అవసరమైన ఫర్నిచర్ వంటి అన్ని వసతులను ప్రభుత్వం సమకూరుస్తోందని తెలిపారు. రెండు నెలల పాటు (60 రోజులు) సాగే తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ నోట్స్ తయారు చేసుకోవాలని, సందేహాలు వస్తే సంకోచించకుండా ఫ్యాకల్టీని అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. రోజూవారీ, వారంతపు, గ్రాండ్ టెస్టులను క్రమం తప్పకుండా రాస్తూ, మార్కులు తక్కువ వచ్చిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. తాను సైతం గతంలో ఐఐటీ కాన్పూర్‌లో చదువుకునే రోజుల్లో సీనియర్ అధికారుల మార్గదర్శనం తీసుకున్నట్లు కలెక్టర్ గుర్తుచేశారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న అభ్యర్థులు రేపు యూనిఫామ్ ధరించి విజేతలుగా నిలిచి, భావి తరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సునీత కుమారి, ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్లు రమేష్, ప్రవీణ్ కుమార్, ఫ్యాకల్టీ రమణ, మోటివేటర్ సల్ల విజయ బాబు, స్టడీ సర్కిల్ సిబ్బంది, అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాదు: అక్షర తెలంగాణ
జూడో క్రీడాకారులను అభినందించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా
రాయపూర్‌లో ఇటీవల నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ఐ (SGFI) అండర్-18 సెంట్రలైజ్డ్ సెలక్షన్ ట్రయల్స్‌లో రాణించి, అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ జూడో క్రీడాకారులను జిల్లా కలెక్టర్ రాజర్షిషా శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అభినందించారు. బ్రెజిల్‌లోని రియో డి జనీరో వేదికగా డిసెంబర్ 3 నుంచి 8 వరకు జరగనున్న 'ఐఎస్‌ఎఫ్ జిమ్నాసియాడ్-2026' టోర్నమెంట్‌కు భారత జట్టుకు ఎంపికైన మోటం హర్షవర్ధన్‌తో పాటు, సెలక్షన్ ట్రయల్స్‌లో మూడో స్థానం సాధించిన రామావత్ తరుణ్‌లను కలెక్టర్ శాలువ, మెమెంటో, ప్రశంస పత్రం అందజేసి
శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రతిభ కనబరిచి దేశం, రాష్ట్రంతో పాటు ఆదిలాబాద్ జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా క్రీడాకారుల డైట్, శిక్షణా శిబిరాలు, ప్రయాణ ఖర్చుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు, సదుపాయాల కల్పనకు పూర్తి సహకారం అందిస్తామని భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీవైఎస్‌వో ఏ. దయానంద రెడ్డి, జూడో శిక్షకుడు నంగునూరి రాజు, తదితరులు పాల్గొన్నారు.
Comments